Monday 30 July 2018

బాల్యం, దైవం, ఈ అనంత విశ్వం

నేను దైవాన్ని నమ్ముతానో లేదో నాకే తెలీదు.


కోపం వస్తే పిచ్చి పిచ్చిగా తిడతాను


విధి నన్ను భయపెడితే , బెదిరిపోయి నాన్నని హత్తుకున్న పిల్లాడిలా


“భయం గా ఉంది కాపాడు, భయం గా ఉంది కాపాడు”


అనుకుని అలా మనసులో పెట్టుకుని జపిస్తా


ఎవరన్నా లేక ఏదన్నా నన్ను బాధపెట్టిన ప్రతీసారి


“ నేను నీకు ఎం అన్యాయం చేసాను, నాకుఎందుకు ఇలా చేస్తావు ? “ అని గట్టిగా ప్రశ్నిస్తా


జీవితం మీద ఆశలేని క్షణం లో కూడా ఆ దైవాన్నే ఆరాదిస్తా ఓ దారి చూపమని


ప్రక్రుతి లో వెతుక్కుంటా,


చెట్టు చెట్టుకి కి ఉన్న కొమ్మారెమ్మల్లోని పచ్చదనం లో


ఘోరున జారే జలపాతపు ఘర్జనలో  


మండు ఎండల వేసవి వేడి లో


వర్షాకాలపు చినుకుల్లో,


అలల చేసే అలికిడి లో,


ఈ విశ్వం లో వెతుక్కుంటా,


రాత్రులు తెచ్చే చుక్కల దుప్పటి లో ,


వేకువజాము తెచ్చే ఆ సూరీడు కిరణాలలో


ఈ పంచభూతాలలో వెతుక్కుంటా


ఆ అష్ట దిక్కులలో వెతుక్కుంటా


ముక్కోటి దేవతలను ఈ మహా పుడమి లో అడుగడుగునా వెతుక్కుంటూ


ఓ తండ్రి లా , ఓ స్నేహంలా, ఈ దైవం నాతొ నిరంతరం పయనిస్తూనే ఉంది


ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే,


నేను దైవాన్ని ఎలా ఊహిస్తానో మీకు ఒక అవగాహన రావాలి అని


గత కొద్దికాలం గా నా జీవితంలో ఏది సరిగ్గా జరగలేదు


చాలా కాలం తరువాత మళ్ళీ సూన్యం లోకి ఎవరో నెట్టేశారు అన్న బాధ


విధిని గెలువలేక ఏడుస్తూనే ఉన్న


దైవాన్ని దారి చూపమని బతిమిలాడి బతిమిలాడి ,


కాలం ఓ పక్క నన్ను కృంగదీస్తున్నా


ఎదో ఒక దారి దేవుడు చూపక పొడా అని ఆశతో అలా ఉండీ ఉండీ


విసుగొచ్చి ,
ఈ దేవుడి పైన కోపం వచ్చి, నోటికొచ్చిన మాటలన్నీ అనేశాను


ఇక ఆ దేవుడు కి నాకు సంబంధం లేదు అని తేల్చేసుకుని వదిలేసాను


అయితే .. నా ఫోన్ లో వాల్ పేపర్ (wallpaper) లో బాలకృష్ణుడి బొమ్మ ఉంది ..


అది నేను తీయటం మరిచిపోయా.


మొన్న ఈ మధ్యనే ఇక్కడ పశ్చిమ తీరాన crater lake


అని ఒక సరస్సు ఉందంటే చూడటానికి వెళ్లాను.


వెళ్ళాను, చూసాను.. ఏడు వేల ఏడు వందల ఏళ్ళ క్రితం ఓ అగ్నిపర్వతం పేలిందంట,


ఆ తరువాత అది కూలి ఆ కూలగా ఏర్పడ్డ లోయలో అలా వర్షాలు పడుతూ నీరు చేరుతూ


ఇప్పుడు ఒక సాగరమై ఉంది


ఆకాశమంత లోతు గా కనిపించే నీలపు రంగు నీటి తో…


అలా చూస్తూ ఉన్న.. మాటలు రావట్లేదు..


అది చూసిన దగ్గర నుంచి ఎదో ఒక ఊహ నన్ను కదిలిస్తుంది ..


ఏంటా ఊహ ఎందుకిలా నన్ను పిలుస్తుంది అని నా మదిలోకి తొంగి చూసుకున్నా ఆ ఊహని


మనం చిన్నప్పుడు ఇసక లో ఆడుకునేవాళ్ళం,


అలా మట్టి తో కొండలా పేర్చి పైన తవ్వి ఓ చిన్న గొయ్యి లా చేసుకుని నీరు పోసేవాళ్ళం..


గుర్తొచ్చిందా ఆ చిన్నప్పటి సరదా


అవును !


అదే జ్ఞాపకం  గుర్తొచ్చింది !


కాకపొతే ఆ జ్ఞాపకం లో ఉన్నది నేను కాదు.


నాకంటే పెద్ద మనకంటే పెద్ద, ఎంత పెద్ద అంటే


ఎవరెస్టు శిఖరం కూడా ఓ ఆట బొమ్మ లా ఆడుకునేంత ఓ విశాలమైన చిన్న పిల్లాడు.


ఓ బుసి బుసి నవ్వుల బుజ్జి బాలుడు  


ఆ బాల కృష్ణుడు !


ఆ కన్నయ్య అలా పాకుకుంటూ వెళ్లి


ఎదో ఓ చిన్న ఇసుకతో కట్టుకున్న బొమ్మ కొండకి ఓ గొయ్యి తవ్వి పెట్టాడేమో …


ఆ కన్నయ్య నీరు పోసి ఆడుకున్నాడేమో ..


అదే ఈ సరస్సుగా మారి నాకు కళ్ళముందు వచ్చిందేమో


ఆ దేవుడు బాలుడిగా కట్టున్న బొమ్మరిల్లు ఈ ప్రక్రుతి కదా.. “


వెంటనే ప్రస్తుతం లోకి వచ్చేసాను …


అదేంటి, నేనేంటి ?


దైవానికి నాకు ఇక ఏమి లేదు కదా, కానీ నాకు ఇలాంటి ఊహలేంటి అని ఆలోచించేసు కున్నా…


కానీ ఆ ఊహ పొవట్లేదు, ఆ దైవం నన్ను వదలట్లేదు


అప్పుడు అర్ధమయ్యింది ..


నేను ఇంతలా నాతొ పెట్టుకుని, కనిపించే ప్రతీ దానిలో


వెతుక్కునే ఆ దైవం ముందు నేను ఓ చిన్న పిల్లాడిని ఏ కదా అని…


అలుగుతాం అమ్మమీద, నాన్న మీద భయం తో అప్పుడప్పుడు దాక్కుంటాం ఎదో ఒక మూలాన..


వెక్కి వెక్కి ఏడుస్తూ “నేను ఇక ఇంటికి రాను” అని


మనకి మనం చిన్నపుడు ఎన్నిసార్లు అనుకున్నాం..


మళ్ళీ వెంటనే మా అమ్మ , మా నాన్న అంటూ పారిపోయేవాళ్ళం వాళ్ళ దగ్గరికి..


నాకు ఈ దైవానికి ఉన్న సంబంధం కూడా ఇలాంటిదే …


కనిపించని ఓ శక్తి లా ఉంటుంది. నాతొ ఎల్లప్పుడూ


గొడవపడతా ,


ఆకాశాన్ని చూసి అరుస్తా


తలుచుకుని తలుచుకుని మరీ తిడతా బాధ వస్తే


ఎంత అరిచినా ఎంత తిట్టినా ఇన్నేసి మాటలన్నా..


నేను చేసిన చేష్టలన్ని ఆ దైవానికి ఓ పెంకి పిల్లాడి అల్లరి లానే కనిపిస్తాయి కదా అని …




ఏంటో .. ఇలా రాస్తుంటే ఎంతైనా చెప్పాలని ఉంది..


నా దేవుడు కదా .. ఎన్నో అనుభవాలు.. మరి !


సర్లెండి ఈరోజకి దీనితో సెలవిద్దాం.


ఇట్లు


పడమటి తీరపు బాటసారి


ఓ సిద్ధార్థుడి కలం


కలం తో కాలం


No comments:

Post a Comment