Monday 30 July 2018

బాల్యం, దైవం, ఈ అనంత విశ్వం

నేను దైవాన్ని నమ్ముతానో లేదో నాకే తెలీదు.


కోపం వస్తే పిచ్చి పిచ్చిగా తిడతాను


విధి నన్ను భయపెడితే , బెదిరిపోయి నాన్నని హత్తుకున్న పిల్లాడిలా


“భయం గా ఉంది కాపాడు, భయం గా ఉంది కాపాడు”


అనుకుని అలా మనసులో పెట్టుకుని జపిస్తా


ఎవరన్నా లేక ఏదన్నా నన్ను బాధపెట్టిన ప్రతీసారి


“ నేను నీకు ఎం అన్యాయం చేసాను, నాకుఎందుకు ఇలా చేస్తావు ? “ అని గట్టిగా ప్రశ్నిస్తా


జీవితం మీద ఆశలేని క్షణం లో కూడా ఆ దైవాన్నే ఆరాదిస్తా ఓ దారి చూపమని


ప్రక్రుతి లో వెతుక్కుంటా,


చెట్టు చెట్టుకి కి ఉన్న కొమ్మారెమ్మల్లోని పచ్చదనం లో


ఘోరున జారే జలపాతపు ఘర్జనలో  


మండు ఎండల వేసవి వేడి లో


వర్షాకాలపు చినుకుల్లో,


అలల చేసే అలికిడి లో,


ఈ విశ్వం లో వెతుక్కుంటా,


రాత్రులు తెచ్చే చుక్కల దుప్పటి లో ,


వేకువజాము తెచ్చే ఆ సూరీడు కిరణాలలో


ఈ పంచభూతాలలో వెతుక్కుంటా


ఆ అష్ట దిక్కులలో వెతుక్కుంటా


ముక్కోటి దేవతలను ఈ మహా పుడమి లో అడుగడుగునా వెతుక్కుంటూ


ఓ తండ్రి లా , ఓ స్నేహంలా, ఈ దైవం నాతొ నిరంతరం పయనిస్తూనే ఉంది


ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే,


నేను దైవాన్ని ఎలా ఊహిస్తానో మీకు ఒక అవగాహన రావాలి అని


గత కొద్దికాలం గా నా జీవితంలో ఏది సరిగ్గా జరగలేదు


చాలా కాలం తరువాత మళ్ళీ సూన్యం లోకి ఎవరో నెట్టేశారు అన్న బాధ


విధిని గెలువలేక ఏడుస్తూనే ఉన్న


దైవాన్ని దారి చూపమని బతిమిలాడి బతిమిలాడి ,


కాలం ఓ పక్క నన్ను కృంగదీస్తున్నా


ఎదో ఒక దారి దేవుడు చూపక పొడా అని ఆశతో అలా ఉండీ ఉండీ


విసుగొచ్చి ,
ఈ దేవుడి పైన కోపం వచ్చి, నోటికొచ్చిన మాటలన్నీ అనేశాను


ఇక ఆ దేవుడు కి నాకు సంబంధం లేదు అని తేల్చేసుకుని వదిలేసాను


అయితే .. నా ఫోన్ లో వాల్ పేపర్ (wallpaper) లో బాలకృష్ణుడి బొమ్మ ఉంది ..


అది నేను తీయటం మరిచిపోయా.


మొన్న ఈ మధ్యనే ఇక్కడ పశ్చిమ తీరాన crater lake


అని ఒక సరస్సు ఉందంటే చూడటానికి వెళ్లాను.


వెళ్ళాను, చూసాను.. ఏడు వేల ఏడు వందల ఏళ్ళ క్రితం ఓ అగ్నిపర్వతం పేలిందంట,


ఆ తరువాత అది కూలి ఆ కూలగా ఏర్పడ్డ లోయలో అలా వర్షాలు పడుతూ నీరు చేరుతూ


ఇప్పుడు ఒక సాగరమై ఉంది


ఆకాశమంత లోతు గా కనిపించే నీలపు రంగు నీటి తో…


అలా చూస్తూ ఉన్న.. మాటలు రావట్లేదు..


అది చూసిన దగ్గర నుంచి ఎదో ఒక ఊహ నన్ను కదిలిస్తుంది ..


ఏంటా ఊహ ఎందుకిలా నన్ను పిలుస్తుంది అని నా మదిలోకి తొంగి చూసుకున్నా ఆ ఊహని


మనం చిన్నప్పుడు ఇసక లో ఆడుకునేవాళ్ళం,


అలా మట్టి తో కొండలా పేర్చి పైన తవ్వి ఓ చిన్న గొయ్యి లా చేసుకుని నీరు పోసేవాళ్ళం..


గుర్తొచ్చిందా ఆ చిన్నప్పటి సరదా


అవును !


అదే జ్ఞాపకం  గుర్తొచ్చింది !


కాకపొతే ఆ జ్ఞాపకం లో ఉన్నది నేను కాదు.


నాకంటే పెద్ద మనకంటే పెద్ద, ఎంత పెద్ద అంటే


ఎవరెస్టు శిఖరం కూడా ఓ ఆట బొమ్మ లా ఆడుకునేంత ఓ విశాలమైన చిన్న పిల్లాడు.


ఓ బుసి బుసి నవ్వుల బుజ్జి బాలుడు  


ఆ బాల కృష్ణుడు !


ఆ కన్నయ్య అలా పాకుకుంటూ వెళ్లి


ఎదో ఓ చిన్న ఇసుకతో కట్టుకున్న బొమ్మ కొండకి ఓ గొయ్యి తవ్వి పెట్టాడేమో …


ఆ కన్నయ్య నీరు పోసి ఆడుకున్నాడేమో ..


అదే ఈ సరస్సుగా మారి నాకు కళ్ళముందు వచ్చిందేమో


ఆ దేవుడు బాలుడిగా కట్టున్న బొమ్మరిల్లు ఈ ప్రక్రుతి కదా.. “


వెంటనే ప్రస్తుతం లోకి వచ్చేసాను …


అదేంటి, నేనేంటి ?


దైవానికి నాకు ఇక ఏమి లేదు కదా, కానీ నాకు ఇలాంటి ఊహలేంటి అని ఆలోచించేసు కున్నా…


కానీ ఆ ఊహ పొవట్లేదు, ఆ దైవం నన్ను వదలట్లేదు


అప్పుడు అర్ధమయ్యింది ..


నేను ఇంతలా నాతొ పెట్టుకుని, కనిపించే ప్రతీ దానిలో


వెతుక్కునే ఆ దైవం ముందు నేను ఓ చిన్న పిల్లాడిని ఏ కదా అని…


అలుగుతాం అమ్మమీద, నాన్న మీద భయం తో అప్పుడప్పుడు దాక్కుంటాం ఎదో ఒక మూలాన..


వెక్కి వెక్కి ఏడుస్తూ “నేను ఇక ఇంటికి రాను” అని


మనకి మనం చిన్నపుడు ఎన్నిసార్లు అనుకున్నాం..


మళ్ళీ వెంటనే మా అమ్మ , మా నాన్న అంటూ పారిపోయేవాళ్ళం వాళ్ళ దగ్గరికి..


నాకు ఈ దైవానికి ఉన్న సంబంధం కూడా ఇలాంటిదే …


కనిపించని ఓ శక్తి లా ఉంటుంది. నాతొ ఎల్లప్పుడూ


గొడవపడతా ,


ఆకాశాన్ని చూసి అరుస్తా


తలుచుకుని తలుచుకుని మరీ తిడతా బాధ వస్తే


ఎంత అరిచినా ఎంత తిట్టినా ఇన్నేసి మాటలన్నా..


నేను చేసిన చేష్టలన్ని ఆ దైవానికి ఓ పెంకి పిల్లాడి అల్లరి లానే కనిపిస్తాయి కదా అని …




ఏంటో .. ఇలా రాస్తుంటే ఎంతైనా చెప్పాలని ఉంది..


నా దేవుడు కదా .. ఎన్నో అనుభవాలు.. మరి !


సర్లెండి ఈరోజకి దీనితో సెలవిద్దాం.


ఇట్లు


పడమటి తీరపు బాటసారి


ఓ సిద్ధార్థుడి కలం


కలం తో కాలం


Sunday 14 May 2017

okkadivai poraadu

ఒరేయ్ ఒరేయ్ నిన్నే ,
ఒక్కడివే ఉన్నావ్ కదా
పోయేదేముంది రా ?

మరేం పర్లేదు , నేరం ఏం కాదు

ఒరేయ్ , ఒరేయ్ నిన్నే  
ఒక్కడివే  ఉన్నావ్ కదా
ఒంటరిగా ఉన్నావ్ కదా
మరేం పర్లేదు లే 
ఈ సాంఘిక జంతువుల నడుమ నీవు ఒక్కడిగా మసలటం తప్పేం కాదు 
సిగ్గుమాలిన ముదరష్టపు
రంకు నాయాల మధ్య
నీవొక్కడివే ఉండు మరేం పర్లేదు 
నీవు నమ్మిన లోకం దొబ్బింది
నువ్వున్న సమాజం  హేళన చేసింది 
నీవనుకున్న నీ ప్రాణం  చులకన చేసింది
నీతో ఉన్న నీ స్నేహం నిన్ను వద్దనుకుంది 
సమాజానికి పనికిరావు
ఇంటికి పనికిరావు 
ఆఖరికి  నీకు కూడా నువ్వు పనికిరావు 
అని దర్జాగా ఈ సమాజం  నీకు సన్మానించింది 
నిలకడ లేదు నీకు అంది
గమ్యం లేదు నీకు అని అంది 
ఇంకా ఎన్నెన్నో అంది
ఎన్నెన్నో చేసింది 
చచ్చిపోదామనిపించింది నీకు 
చచ్చేమలాభం అని కూడా నీకు తెలుసు 
మౌనంగా ఉన్నావ్ అంతే నువ్వు ,
చిరునవ్వుతో పక్కకువొచ్చావ్ నువ్వు 
ఒక్కడివీ నువ్వు , ఒక్కడిగా నువ్వు 
తప్పులేదు రా, తప్పు కాదురా 
నీవు నమ్మిన సిద్ధాంతం కొరకు
నీవు నమ్మిన దారి కొరకు మాత్రమే నువ్వు పోరాడు 
ఈ పుణ్యభూమిలో చాలా మంది ఉన్నారు లే , సుగుణులు , నీతిమంతులు , ప్రయోజకులు
వాళ్ళని అలా వదిలేసి నీకోసం నువ్వు పరిగెత్తు
నేల నిన్ను కాదనలేదు గా ,
నీ అడుగుల్లో కూడా నెతోడుగా ఉంది. 
నీరు నిన్ను కాదనలేదు గా ,
నీ కన్నీళ్ళలో కూడా నీతోనే ఉంది 

గాలి నిన్ను ఒద్దనలేదు గా
నీ ఊపిరై నీకు తోడుంది  
ఆకాశం నిన్ను దిక్కరించలేదు గా
వచ్చి తనని అందుకోమంటుంది
రెక్కలుకట్టుకు ఎగరమంటుంది 
నిప్పు నిన్ను వీడలేదు గా
నిత్యం నీలో రగులుతుంది 
ఇంకేం కావలి రా నీకు

ఇంకేం కావలి ?
పంచభూతాలు నీలో ఉంచుకొని 
ఇంకేం కావలి రా నీకు
లే పోరాడు పో ,
పో రా ఒరేయ్ పోరాడు 
ఈ నేల మీద నీకు ఆఖరికి ఉండే ఆరడగుల గొయ్య కోసం అర్హత తెచ్చుకో పో 
వెళ్లు , ఒంటరిగానే ఉండు
మరేం పర్లేదు పో

#ఓసిద్ధార్థుడికలం
#కలంతోకాలం
#బాటసారి 
#osiddahrthudikalam
#kalamthokaalam
#baatasaari 

Saturday 29 April 2017

ఉద్యోగం ఒచ్చింది

"ఉద్యోగం ఒచ్చింది "
మాట వినగానే ఆనందం తో పరిగెత్తుకు పోయా నా మిత్రుడిని కలవడానికి ,
వాడి జీవితం లో అది ఒక పెద్ద విషయమే.

ఎలాగోలా బతకాలి అనుకుంటే ఎలాగైనా బతికెయ్యొచ్చు , 
కానీ నేను ఇలాగే బతకాలి అనుకున్నా కాబట్టే ఇలా ఉన్నా . 

అని ఆకలి రాజ్యం సినిమా లో కమల్ హస్సన్ చెప్పిన
మాటలకి నిలువెత్తు సాక్ష్యం వాడు , నా మిత్రుడు.

కళ కోసం కలం కోసం నా జీవితం అంటూ
చదివిన చదువూ కూడా పక్కన పెట్టి
రచయత  అవుతానని , అక్షరాల్లో ఆనందం వెతుక్కుంటూ
ఈ సమాజాం లో ఒక స్థానం కోసం ఇల్లు వదిలి ఈ ఊరికి ఒచ్చాడు.

హెహ్
ఈరోజుల్లో తెలుగు ఎవడు చదువుతాడు రా అని అందరూ హేళన చేస్తుంటే
ఏమాత్రం బెదరక పోరాడాడు. తెలుగులోనే తన తోలి అడుగు వేస్తానంటూ.

మరి అలాంటి వాడికి ఉద్యోగం వచ్చింది అంటే మాటలా ?
నాలా సమాజాం తో సద్దుకుపోయే రకం కాదు.
వాడు వేరే. అందుకే వాడితో ఉంటే నాకు ఏదోకటి చెయ్యాలని ఉంటుంది.

మొత్తానికి నా మిత్రుడు ఉద్యోగస్తుడయ్యాడు.
అభినందిద్దామనే వెళ్తున్నా  ఆనందం తో,
వాడికి కోపమొచ్చిన బాధోచ్చినా , ఆనందమోచ్చిన్నా ఆవేదనొచ్చినా
ఆయా సముద్రం ఒడ్డున రాళ్ల మీద ఒంటరిగా కూర్చొని రాసుకుంటాడు.
అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు వాడు రాసుకున్న కథలతో కాలక్షేపం చెయ్యడానికి.
ఇప్పుడూ అక్కడే ఉన్నాడు.

కానీ నేను వెళ్లే పాటికి అక్కడ ఓ పదిమంది దాకా ఉన్నారు ఇవ్వాళ . నా మిత్రుడికి అభిమానుల వరుస మొదలయ్యింది అనుకుంటూ ఇంకా కధంతా సుఖాంతమే అని దగ్గరకు వెళ్ళా.

ఆ గుంపు ని తోసుకొని వెళ్ళా వాడిని హత్తుకోడానికి.

ఎదురుగా నోటిలో రక్తం కక్కుకుంటూ చేతిలో సిర కక్కుతున్న కలంతో  పడి ఉన్నాడు .

కాదు పడి ఉంది ,
వాడి దేహం .

వాడి కధ  వినడానికి వచ్చాను , ముగిసిన వాడి కధను చూడటానికి అనుకోలేదు.
నేల మీద మొక్కాళ్ల  మీద పడి వాడి ని ముట్టుకోవడానికి ప్రయత్నించా
ధైర్యం చాలట్లేదు ,
గొంతు దాటి మాట రాట్లేదు.

ఇంతలో " ఇతను మీకు తెలుసా ? " అని ఎవరో అంటే తలూపాను. చేతికి వాడి పుస్తకం ఇచ్చారు.
ఆఖరి కాగితం లో ఓ లేఖ.

" ఉద్యోగం వచ్చింది , యమలోకం లో "
అంటూ ...

" ఉద్యోగం ఒచ్చింది , నరకం లో

ప్రస్తుతానికి నూనె లో వేయించబడే పని, నాకు కొత్త కాదు కాబట్టి బాగానే కాలుతా అని అనుకుంటున్నా.
మెల్లగా యమదూతనైపోతా.

మరి పైన ఉద్యోగం అంటే కింద ఉండటం కుదరదు అందుకే వెళ్తున్నా,

నరకం లోనే ఉద్యోగం ఎందుకు ఒచ్చింది అంటే

ఆ దేవుడు నేను సమాజాం తో సద్దుకుపోవాలి అని రాతరాసాడు 
దానికి నేను తలవంచలేదు గా, అందుకే.

నా రాత నేనే మార్చుకుంటా అంటూ
నేను రాసిన రచనలని తీసుకొని ఈ ఊరికొచ్చాను.

ఆంగ్ల భాష అక్షరాలు రాక ,
అమ్మ భాష ఆప్యాయం వీడలేక
నిత్యం నాలో నేను ప్రతిఘటించా

మానాన్ని అమ్ముకోలేక
అభిమానాన్ని చంపుకోలేక
నలుగుతూ బతికా

వీధికుక్క కూడా రోజూ తిండి తింటుంటే
రోజుకొక్కపూటైనా పొట్ట నిండుద్ధో లేదో తెలీని బతుకు నాది.

ఆశయం చావక
ఆకలి తీరక
అస్త వ్యస్థ ఆవేదన లో  కూడా
అక్షరాలతోనే నా బతుకు ని బతికి సచ్చా

ఇంకా కొత్తగా ఏముంది నేను సావడానికి

అడుక్కోవడం కూడా చెత్తకాని  చేతకాని  చదువుకున్న వాడను నేను .

అందుకే నరకానికి బయలుదేరా
భూమ్మీద అనుభవించిన దానితో
ఈ సమాజాం నేర్పించిన సత్యాలతో
అక్కడ తెచ్చుకున్నా ఒక ఉద్యోగం

నా ఈ కాలం ఇక్కడితో సమాప్తం.
కలం కూడా తీసుకుపోతున్నా నాతోపాటు

వీలుదొరికితే అక్కడైనా రాసుకుందామని .
ఉద్యోగమొచ్చింది మిత్రమా !. " .
.... ...

ఓ సిద్ధార్థుడి కలం
కలంతో కాలం
బాటసారి

Wednesday 26 April 2017

nenanu nijam uhalavyuham

అద్దం  ముందు నిలబడ్డ ప్రతీసారి
నాలో నాకు ఇద్దరు కనిపిస్తారు.

1. ఎలా ఉండాలనుకున్న నేను
2. ఎలా ఉన్న నేను

ఇలా ఇల పై నే నిలబడి నా అర్ధం కోసం నా యదార్ధం తో నిత్యం ఘర్షణ పడుతూ
ప్రతిఘటించే ప్రత్యర్థులైన నా ప్రతికూల భావాలను అధిగమించి అనుకూల వర్ణన గా
మార్చుకునే భావద్వేగాల సంఘర్షణలతో పట్టువదలక అనుక్షణం పోరాడి నా ఊహలని
నా వ్యూహాలని నిజంచేసి

అద్దం లో కనబడు ఆ రెండు ప్రతిబింబాలను ఒకటి గా చేసి

నేను నిజమై ఈ నేల పై నిలబడటం
నా జీవితపరమార్ధం  

Tuesday 25 April 2017

నా మిత్రుడి జన్మదిన కానుక

నువ్వు నా జీవితం లో

అండ వో , లేక అడ్డు వో
ఆనందమో , లేక ఆవేదనో
ఇలా
నువ్వు నా జీవితం లో
నవరసాలూ ఇచ్చే భావేద్వేగాలలో
మొత్తానికి ఓ తోడుగా ఉన్నావ్

ఏదొచ్చినా వెంటే ఉంటూ
వీలున్నప్పుడు నువ్వుగా
లేనప్పుడు నీ ఉనికి తెలియజేస్తూ
మొత్తానికి నువ్వున్నావ్

ఎప్పటికీ నేను ఋణపడివుండే నీ బంధం
మన ఈ స్నేహం  అనే  అనుబంధం

కర్ణ సుయోధనులో ,
రామ సుగ్రీవులో
అంటుంటారు గా
అలా
మనలో ఎవరికీ ఎవరు ఏమవుతామో తెలీదు కానీ
ఒకరికి ఒకరుంటామ్
అలాంటి నీకు
నా జీవితం దాసోహమిస్తూ
నా కలం తో నీకు ఇవ్వగలిగిన చిన్న కానుక
"జన్మదిన శుభాకాంక్షలు రవి "
- బాటసారి


Tuesday 18 April 2017

o nanna chesey naayakudu

""మన మనుగడ కోసం వేటాడాలి .

ఆటవికం అన్నాం ఆకాలాన్ని

మన మనుగడ కోసం ఆటాడాలి

మహాభారతం అన్నాం ఆయా కాలాన్ని

మన మనుగడ కోసం పోరాడాలి
మన బలం కోసం బరి దాటాలి

మన ఉనికిని తెలపడానికి
రాజ్యాలు నడపాలి , రాజకీయాలు జరపాలి

"ప్రయోజకుడు" అన్న పిలుపు కోసం
ప్రాయమంతా పుస్తకాలతో పాతుకుపోవాలి

జ్ఞానం వదిలి సమాజాపు గొర్రెల మందల గానం పఠించాలి

నెలాఖరులో రాలు నాలుగు రాళ్ల జీతం తో జీవితపు రాతలు రాయాలీ

మహానగరాల్లో , గడియారం చుట్టూ పరిగెడుతూ
కూడబెట్టిన పైసా పైసాని
పన్నులనీ ప్రపంచపు తీరుతెన్నులనీ తరిగిపోతుంటే కొంచెం కొంచెంగా

చుట్టపు చూపు గా వచ్చిన ఆ జబ్బుని డబ్బు తో సద్దిచెబుతూ

కాలంతో భారంగా

ఈ మన నేటి భారతాన్ని నడపాలి

దీన్ని పాటించినవాడు పౌరుడయ్యాడు
తిరగరాసిన వాడు యోధుడయ్యాడు
తప్పుపట్టిన వాడు మూర్ఖుడయ్యాడు
తెలివిగా వాడిన వాడు చరిత్రకెక్కాడు

వీటిని వదిలిన వాడే సాధువయ్యాడు

ఇలా అన్నింటిలో ఉన్నారే నలుగురు

ఆ నలుగురే రా

ఆ నలుగురే నువ్వు చస్తే నీ పాడినెత్తేది
నిన్ను కాటికి మోసేది

ఆ నలుగురే నువ్వు ఇంత కాలం బతికిన సమాజం లో
నువ్వు సంపాదించాల్సింది

నీ కుర్చీకి నాలుగు కాళ్ళ గా ఉండాల్సింది ఈ నలుగురే
. ""

ఎదుగుతున్న కొడుకు లో నాయకుడుగా ఎలా ఎదగాలో చెప్పిన
తండ్రి .
....
ఓ సిద్ధార్థుడి కలం
కలం తో కాలం
కాగిత కవితగ పయనం

Saturday 7 January 2017

మనం చెరిచిన గంగ

కైలాసానికి కోడలు నీవై
మా కాలువ కలిసిన కలుషిత గంగై

నువ్వు కొండలు కోనలు లోయలు దాటితే
గొడ్లు ముడ్లు దొడ్లు కడుగుతాం

జలపాతం గా నువ్వు జారితే
జలకాలాటలో మేము తేలుతాం

మోక్షం కోసం నీలో మూలుగుతాం
మూత్రం కూడా నీలో కలుపుతాం

పుడమితో సాగే అనుబంధాన్ని
కంచలేసి మరి కొల్లగొట్టుతాం

విశ్వమంతా  నిండిన నిన్ను
విచ్చలవిడిగా వ్యభిచారిస్తాం

 - ఓ సిద్ధార్థుడి కలం
ఓ మిత్రుడి సహకారం తో రాసినది